
మీ అందరికీ
'జయం' చేసిన ఉగాది
శుభాకాంక్షలు
మళ్ళీ మరోయుగాది స్వాగతం పలుకుతోంది
పదండి మరి...సరికొత్త యుగంలోకి పయనిద్దాం.
గత ఏడాది 'విజయా'నుభూతులతో
'జయజయ’ నినాదాలతో నూతన ‘జయ’ సంవత్సరంలో ప్రవేశిద్దాం.
ఆరు ఋతువుల ఆరంభాన్ని ఆమనిలో ఆరాధిస్తూ
ఆరురుచుల ఐక్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ
అడుగడుగునా జీవనకళని అవలీలగా అనుభవిద్దాం.
ఆరురుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించడమంటే
ఆటుపోటుల జీవనభిన్నత్వాన్ని సమభావంతో సర్దుకుపోవడమే
ఒడిదుడుకులన్నింటినీ ఒకేవిధంగా ఓర్చుకోవడమే.
ఆరు అంతశ్శత్రువులని పచ్చడిగా ఆరగించి
హాయిగా హరాయించుకొవడమే.
అందుకేగదా-
ఉగాదులు ఆరుపదులుగా ఆగమనం చేస్తాయి.
అరవై ఏళ్ళ వయసొచ్చే సమయానికి
సంసారసాగర మథనంలో ఆరుపదుల ఉగాదుల కాలచక్రం అలవోకగా తిరిగి వస్తుంది.
అంటే-
ఆరు అంగాలతో జనించిన ఈ దేహంతో
ఆరు వేదాంగములను అధ్యయనం గావించి
ఆరారు ఋతువుల కాలగమనంలో
ఆరుమతముల సనాతనధర్మ అద్వైత తత్వ వివేచనతో ఆరేసి కర్మలనాచరిస్తూ
ఆరు ఐశ్వర్యములకై అద్భుతంగా పరిశ్రమిస్తూ
ఆరు గుణాలకు అతీతంగా
ఆరుచక్రముల యోగవిన్యాసములతో
అరిషడ్వర్గములను హరించడమేగదా
ఆరుపదుల ఆరురుచుల ఉగాదుల అంతరార్థం.
~రత్నశిఖామణి
* * *
ఆరు రుచుల అంతరార్థం ఈ అన్నింటినీ ఏకభావంతో ఆస్వాదించడమే.
ఆరురుచులు: షడ్రుచులు: 1. వగరు, 2.తీపి, 3.ఉప్పు, 4.కారము, 5.చేదు, 6.పులుపు.
ఆరు శరీరాంగములు: 1.శిరస్సు, 2.మధ్యము, 3.కుడి చేయి, 4.ఎడమ చేయి, 5.కుడి కాలు, 6.ఎడమ కాలు
ఆరు వేదాంగములు: 1.శిక్ష, 2.వ్యాకరణము, 3.చంధస్సు, 4.జ్యోతిష్యము, 5.కల్పము, 6.సాంఖ్యము
ఆరు ఋతువులు: 1. వసంత ఋతువు - చైత్ర, వైశాఖ మాసాలు. 2. గ్రీష్మ ఋతువు - జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు. 3. వర్ష ఋతువు - శ్రావణ, భాద్రపద మాసాలు. 4. శరత్ ఋతువు - ఆశ్వయుజ, కార్తీక మాసాలు. 5. హేమంత ఋతువు - మార్గశిర, పుష్య మాసాలు. 6. శిశిర ఋతువు - మాఘం, ఫాల్గుణం మాసాలు
ఆరుమతములు: షణ్మతములు : 1.శైవము, 2.వైష్ణవము, 3.శాక్తేయము, 4. గాణావత్యము, 5.సౌరవము, 6.కాపాలము
ఆరు కర్మలు: షట్కర్మలు: 1.యజనము, 2.యాజనము, 3.అధ్యయనము, 4.అధ్యాపనము, 5.దానము, 6.ప్రతిగ్రహము.
ఆరు ఐశ్వర్యములు: 1. శక్తి (energy), 2. జ్ఞానము(knowledge), 3. వైరాగ్యము (detachment) 4. యశము (fame) 5. వీర్యము (might). 6. తేజము (greatness)
షడ్విధ గుణములు : (రాజనీతి యందు) 1. సంధి. 2. విగ్రహము, 3. యానము. 4. సంస్థాపనము. 5. ఆసనము. 6. ద్వైధీభావము
ఆరు చక్రములు: షట్చక్రములు: 1. మూలాధార చక్రము 2. స్వాధిష్ఠాన చక్రము 3. మణిపూరక చక్రము 4. అనాహత చక్రము 5. విశుద్ధ చక్రము 6. ఆజ్ఞా చక్రము
ఆరు అంత్శత్రువులు: అరిషడ్వర్గము: 1.కామము 2. క్రోధము 3. లోభము 4. మోహము 5. మదము 6. మాత్సర్యము
No comments:
Post a Comment